Jana Sena News
Breaking
Logo
Jana Sena News
చైనాకు ప్రయాణించేటప్పుడు, చైనా మీదుగా రాకపోకలు సాగించేటప్పుడు భారతీయులు జాగ్రత్తలు తీసుకోండి
న్యూఢిల్లీ: చైనాకు ప్రయాణించేటప్పుడు, ఆ దేశం మీదుగా రాకపోకలు సాగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత పౌరులకు విదేశాంగ శాఖ (MEA) సూచించింది. గత నెలలో పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ అనే భారత మహిళకు ట్రాన్సిట్ హాల్ట్ కోసం చైనాలోని షాంఘైలో దిగినప్పుడు ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో ఎంఈఏ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, చైనాకు ప్రయాణించేటప్పుడు, చైనా మీదుగా రాకపోకలు సాగించేటప్పుడు భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీజింగ్ సైతం అంతర్జాతీయ విమాన ప్రయాణ నిబంధనలను గౌరవిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ భారత్‌లో భూభాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పామని, ఇందులో ఎవరి జోక్యాన్ని తాము కోరుకోవడం లేదని తెలిపారు. ఇండియా-చైనా సంబంధాలపై మాట్లాడుతూ, ఇరుదేశాల సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని, ఆ దిశగా ముందుకు సాగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ గత నెలలో లండన్ నుంచి జపాన్‌కు వెళ్తూ ట్రాన్సిట్ హాల్ట్ కోసం చైనాలోని షాంఘైలో దిగారు. అక్కడ తన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కావడంతో పాస్‌పోర్ట్‌ చెల్లదని అధికారులు తనను అడ్డుకున్నట్టు ఆమె చెప్పారు. స్థానిక భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించడంతో తనకు సాయం అందిందని తెలిపారు. ఈ ఘటనను భారత్ ఖండించింది. అయితే థాంగ్‌డోక్‌ను తాము నిర్బంధించ లేదని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.